పాలిటెక్నిక్ లో 25,137 మందికి సీట్లు..ఫస్ట్ ఫేజ్‌లో 77%  సీట్లు నిండినయ్ 

పాలిటెక్నిక్ లో 25,137 మందికి సీట్లు..ఫస్ట్ ఫేజ్‌లో 77%  సీట్లు నిండినయ్ 
  • ఇక్కడా కంప్యూటర్ సైన్స్‌‌కే క్రేజ్.. అత్యధికంగా 5,688 అడ్మిషన్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. మొత్తం 32,813 సీట్లకు.. 25,137 మందికి సీట్లు దక్కాయి. ఇంజినీరింగ్‌‌లో మాదిరిగా పాలిటెక్నిక్‌‌లోనూ విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్‌‌కే జై కొట్టారు. మెజారిటీ విద్యార్థులు ప్రభుత్వ కాలేజీల్లో చేరేందుకే ఆసక్తి చూపారు. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ ఎ.శ్రీదేవసేన ఆదివారం వివరాలు వెల్లడించారు.  

సర్కారు సీట్లకు ఫుల్ డిమాండ్..

ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో సీట్లకు ఫుట్ డిమాండ్ నెలకొన్నది. రాష్ట్రంలోని 59 సర్కారు కాలేజీల్లో అందుబాటులో ఉన్న 18,284 సీట్లలో ఏకంగా 16,777 (92 శాతం) సీట్లు భర్తీ అయ్యాయి. ఇక ప్రైవేట్ కాలేజీల పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. 53 ప్రైవేట్ కాలేజీల్లో 14,529 సీట్లకు.. కేవలం 8,360 (58 శాతం) మంది మాత్రమే చేరారు. ప్రైవేట్ కాలేజీల్లో ఇంకా 6,169 సీట్లు ఖాళీగా ఉండటం గమనార్హం. కేటాయింపులు పొందిన విద్యార్థులు ఈనెల 9లోపు ఆన్‌‌లైన్‌‌లో ఫీజు చెల్లించి, అలాట్‌‌మెంట్ ఆర్డర్ డౌన్‌‌లోడ్ చేసుకోవాలని కమిషనర్ శ్రీదేవసేన సూచించారు. కాలేజీల్లో రిపోర్టింగ్ చేయడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. 

సివిల్, మెకానికల్ వెనకే..

ఒకప్పుడు టాప్‌‌లో ఉన్న సివిల్, మెకానికల్ బ్రాంచ్‌‌లు ఇప్పుడు వెనకబడ్డాయి. కంప్యూటర్ సైన్స్‌‌లో అత్యధికంగా 5,688 సీట్లు నిండగా, ఎలక్ట్రానిక్స్ (ఈసీఈ) 4,143 సీట్లు భర్తీ అయ్యాయి. కొత్త కోర్సులైన ఏఐ అండ్ ఎంఎల్, సైబర్ సెక్యూరిటీ వంటి వాటికి కూడా మంచి ఆదరణ లభించింది. అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు జూన్ 8 నుంచి క్లాసులు ప్రారంభంకానున్నాయి. రెండో విడత కౌన్సెలింగ్ జూన్ 16 నుంచి మొదలవుతుందని అధికారులు తెలిపారు.

ఎక్కువ అడ్మిషన్లు అయిన టాప్-5 కోర్సులు..

బ్రాంచ్ పేరు                                                     మొత్తం సీట్లు              నిండిన సీట్లు          శాతం  
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్          7,113                               5,688                           80 
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్  5,805                      4,143                            71 
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్     5,830                          3,987                            68 
మెకానికల్ ఇంజినీరింగ్                                3,799                                 2,861                              75 
సివిల్ ఇంజినీరింగ్                                 3,681                                     2,833                                    77